Sunday, April 15, 2012

రమాబాయి అంబేడ్కర్‌ జీవిత చరిత్ర - హిందీ మూలం: శాంతి స్వరూప్‌ బౌద్ధ్‌ - తెలుగు అనువాదం: డా.జి.వి.రత్నాకర్‌ ...




డా.బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఇల్లాలు రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే ఈ రచన కొంత ఆలస్యంగా వచ్చినా సాహిత్య లోకంలో ముఖ్యంగా జీవిత చరిత్రల కోవలో ఒక పెద్ద లోటును పూరించింది.

శతాబ్దాలుగా వర్గ వర్ణ విభజనలతో అతలాకుతలంగా వున్న భారత సమాజ ధర్మాన్ని ప్రశ్నించి నిలదీసి సమధర్మం, సమన్యాయం ఏర్పాటుచేసిన మహనీయుడు డా.అంబేడ్కర్‌.
ఆయన భార్య రమాబాయి జీవన గమనాన్ని అర్థం చేసుకుంటే, ఆమె కూడా ఆయన మార్గాన్నే ఆమోదించినట్లు స్పష్టపడుతుంది.

పోరాటాలకు, త్యాగాలకు, బాధలు భరించటానికి మనిషి సిద్ధంగా వుండాలనేవాడు అంబేడ్కర్‌. ఆ మాటలను రమాబాయి తన జీవితానికి ఎంతగా అనువర్తింప జేసుకున్నదో ఈ పుస్తకం విశదపరుస్తున్నది.

అట్టడుగు వర్గాల స్త్రీలకు నాగరిక సమాజంలో తగిన గౌరవమర్యాదలు లభించటం లేదన్న సత్యాన్ని ఆకళింపు చేసుకున్న అంబేడ్కర్‌ ఆమెకు సామాజిక క్షేత్రంలో కీలకమైన బాధ్యతలు అప్పగించలేదు. కుటుంబ బాధ్యతలు, దారిద్య్రం, పిల్లల మరణాలు, ఆమె ఆరోగ్యం దెబ్బతీయడం కూడా అందుకు కారణాలయ్యాయి. చాలా చిన్న (ఎనిమిది తొమ్మిదేళ్ల) వయసులోనే ఇంటి కోడలిగా వచ్చిన రమాబాయి ఇంటి బాధ్యతను చాలా ఆనందంగా స్వీకరించింది. కుటుంబ సభ్యుల అవసరాలు, వారి మనోభావాలు అర్థం చేసుకుంటూ ఎదిగింది.
జాతి అవసరాల గురించే తప్ప కుటుంబం గురించి ఆలోచించే సమయం డా.అంబేడ్కర్‌కు లేదనీ, ఆయన లక్ష్యం వేరనీ అర్థం చేసుకుని ఆయన సహధర్మచారిణిగా ఆ బాధ్యతనంతా తనమీద పెట్టుకుంది.

అంబేడ్కర్‌ పైచదువులకు విదేశాలకు వెళ్లినప్పుడు ఇక్కడ ఆయన కుటుంబ అవసరాలు ఎలా తీరాయి. ఇల్లు ఎలా గడిచింది? అనేది చాలా మందికి కలిగే సందేహం. ఆ సందేహానికి సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుంది.
అంబేడ్కర్‌ విద్యా వ్యాసంగం, సమాజ సంస్కరణ కార్యక్రమాలు, ఉద్యమాలు నిరంతరాయంగా సాగటానికి రమాబాయి ఎంతగా సహకరించిందో తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యం కలుగుతుంది.

............... - డా.బి.విజయభారతి (ముందుమాట 'భారతదేశ చరిత్రను తిరగరాసిన రమాబాయి' నుంచి)

'' రమాబాయి ఏ రకమైన ప్రలోభాలనూ తన దరిదాపుల్లోకి రానీయలేదు. ఔను, మా బతుకుదారులు మాకున్నాయి అన్నట్టు తన భర్త బారిష్టరైనా తాను పేడ ఎత్తి పిడకలు చేసి సంసారాన్ని ఎల్లదీసింది. ఆమె తన బాధ్యతను నెరవేర్చాననుకుంది కానీ తనకు తెలియకుండానే ఈ అవినీతిమయమైన, పురుషాధిక్య వ్యవస్థను ధిక్కరించింది. ఆత్మగౌరవ ప్రకటన చేసింది. అందుకే రమాబాయి తన ఇంటికే కాదు... ఒక ప్రపంచ మేధావిని తీర్చిదిద్ది ఈ దేశానికే దీపమయిందని అనలేమా?
ఆ మనస్తత్వం మానసిక ధైర్యం మనకు లేవా? లేకుంటే అలవర్చుకోవాలి. తప్పదు మరి...''

............... - గోగు శ్యామల ('ఆత్మగౌరవపు ఒరవడి సృష్టించిన రమాబాయి' ఉపోద్ఘాతం నుంచి)



రమాబాయి అంబేడ్కర్‌
జీవిత చరిత్ర


హిందీ మూలం: శాంతి స్వరూప్‌ బౌద్ధ్‌
తెలుగు అనువాదం: డా.జి.వి.రత్నాకర్‌


52 పేజీలు, వెల రూ. 40/-

ప్రతులకు :

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com


.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌